కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఢిల్లీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు రూ. 5వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇళ్లు లేనివారు నివసించేందుకు నైట్ షెల్టర్స్ కూడా పెంచామని సీఎం కేజ్రీ తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. కరోనా బారిన పడిన ఐదుగురు కోలుకున్నారని కేజ్రీవాల్ తెలిపారు. లాక్‌డౌన్‌ను ప్రజలు విధిగా పాటించాలని తెలిపిన కేజ్రీవాల్.. వైరస్ నియంత్రణలో సామాజిక దూరం పాటించడం కీలకాంశమన్నారు.
కాగా, ప్రభుత్వం ఇంతకుముందే లబ్దిదారులకు రూ. 4 వేల నుంచి 5 వేలు పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. రేషన్‌కార్డుదారులకు ప్రతి నెలా ఇచ్చే సరుకులను 50 శాతం అదనంగా ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.