ఇది జీవితకాల సవాల్‌

కరోనా వైరస్‌పై పోరు ను ‘జీవితకాల సవాల్‌'గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ప్రజలు ‘లాక్‌డౌన్‌'ను పెద్దగా పట్టించుకోవడంలేదని సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి ఇండ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తిచేశారు. ‘లాక్‌డౌన్‌ను అనేకచోట్ల ప్రజలు పట్టించుకోవడం లేదు. దయచేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ కుటుంబాలను కాపాడుకోండి. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించండి’ అని ట్విట్టర్‌ వేదికగా విన్నవించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలను పక్కాగా అమలుచేయాలని సూచించారు. మరోవైపు ప్రధాని మోదీ మీడియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొవిడ్‌-19 వైరస్‌పై పోరును ‘జీవితకాల సవాల్‌'గా అభివర్ణించారు. ఈ వైరస్‌ కట్టడికి వినూత్న, సరికొత్త పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో మీడియా సిబ్బంది ఈ దేశానికి చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు. మహమ్మారి తీవ్రతను, దాని దుష్ప్రభావాలను అర్థం చేసుకొని ప్రజల్లో అవగాహన పెంచుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను, నిరాశావాదాన్ని పోగొట్టేలా సానుకూల కథనాలు ప్రసారం చేయాలని కోరారు. ‘మనం సుదీర్ఘ యుద్ధం చేయాల్సి ఉన్నది. సామాజిక దూరంపై ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలి. తాజా పరిస్థితులు, ప్రభుత్వ కీలక నిర్ణయాలు, ఇతరాంశాలను వేగంగా, సులభంగా అర్థమయ్యే భాషలో ప్రజలకు వివరించాలి’  అని సూచించారు. కరోనాపై పోరులో మీడియా చానళ్ల ఫీడ్‌బ్యాక్‌ ఎంతో కీలకంగా మారుతున్నదని, దానికనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.