పసికందు ప్రాణాలు కాపాడిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌

కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ఓ పసికందు ప్రాణాలను సీఆర్పీఎఫ్‌ జవాను కాపాడారు. ఈ సంఘటన శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. తాహీర్‌ అహ్మద్‌ దార్‌(30), హుమారియా(27) రోజు వారీ కూలీలు. ఈ దంపతులకు ఐదు రోజుల క్రితం పండంటి మగ బిడ్డ జన్మించింది. అయితే ఆ బాబుకు పుట్టుకతోనే గుండె సమస్య వచ్చింది. మెరుగైన చికిత్స నిమిత్తం శిశువును ఢిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లాలని స్థానిక డాక్టర్లు తాహీర్‌కు సూచించారు. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలపై నిషేధం.


ఏం చేయాలో తోచక.. తాహీర్‌ జరిగిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అతని స్నేహితుడు ఒకరు స్పందించి.. ఇదే విషయాన్ని శ్రీనగర్‌లోని మదద్‌గర్‌ సీఆర్పీఎఫ్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో మంగళవారం రోజు సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఆసిఫ్‌ ఉల్‌ రహమాన్‌.. తాహీర్‌ నివాసానికి చేరుకున్నారు. అక్కడున్నుంచి సీఆర్పీఎఫ్‌ వాహనంలో బాలుడిని.. షేర్‌ ఈ కశ్మీర్‌ ఇనిస్టిట్యూట్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేసి బాలుడి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం శిశువు వెంటిలేటర్‌పై ఉన్నప్పటికీ, కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. కష్టకాలంలో సీఆర్పీఎఫ్‌ జవాను తమ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్లే బిడ్డ ప్రాణాలను కాపాడుకోగలిగామని తాహీర్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.